దేశాన్ని అస్థిరపరిచేందుకు దాడులు: సుసిలో

ఇండోనేషియా రాజధాని జకార్తాలో శుక్రవారం రెండు లగ్జరీ హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు సుసిలో బంబాంగ్ యుధోయోనో మాట్లాడుతూ.. దేశాన్ని అస్థిరపరిచేందుకే ఉగ్రవాదులు దాడులకు కుట్రపన్నుతున్నారన్నారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు సమాచారం ఉందని తెలిపారు.

అంతేకాకుండా తనను హత్య చేసేందుకు కూడా కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లపై కూడా ఈ కోణంలో దర్యాప్తు జరపాలని అధికారిక యంత్రాంగాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు కోరారు. జకార్తాలోని జేడబ్ల్యూ మారియట్, దీనికి సమీపంలోని రిట్జ్ కార్ల్‌టన్ హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. సుసీలో ఈ బాంబు పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. వీటిని కిరాతకమైన ఉగ్రవాద చర్యగా వర్ణించారు. ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకొని, చట్టం ముందు నిలబెడతామని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి