నవంబరు 24న ప్రధానికి ఒబామా దంపతుల విందు!

ఆదివారం, 4 అక్టోబరు 2009 (10:22 IST)
వచ్చే నెల 24వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. శ్వేతసౌథంలో ఒబామా అడుగుపెట్టిన తర్వాత ఒక దేశాధినేతకు విందు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఒబామా ఆహ్వానం మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబరులో అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, సత్‌సంబంధాలు పటిష్టతకు మరింతగా దోహదపడనుంది. 24వ తేదీన వాషింగ్టన్‌కు చేరుకునే ప్రధానికి బరాక్‌ ఒబామా దంపతులు స్వయంగా శ్వేత సౌధంలోకి ఆహ్వానించనున్నారు.

ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్‌ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఒబామా దంపతులు మన్మోహన్‌సింగ్‌ దంపతులకు అధికారిక విందునిస్తారని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి రాబర్ట్‌ గిబ్స్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒబామా హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అమెరికాలో జరుపననున్న ఈ తొలి పర్యటన ఇదే.

ఈ పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు వేదికకానుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం జరిగే ఈ భేటీలో అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ద్వైపాక్షిక సంబంధాలపై ఒబామా, మన్మోహన్‌లు చర్చించే అవకాశాలున్నాయని గిబ్స్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి