నెజాద్ ఆరోపణలను తోసిపుచ్చిన వైట్‌హోస్

ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తన దేశంపై చేస్తున్న ఆరోపణలను అమెరికా అధ్యక్ష భవనం గురువారం తోసిపుచ్చింది. ఇరాన్‌లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అహ్మదీనెజాద్ తిరిగి విజయం సాధించారు. నెజాద్ విజయం అక్రమమార్గాల్లో జరిగిందని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా గత రెండు వారాల నుంచి ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం ఇరాన్‌లో నెలకొన్న అశాంతిపై అమెరికా, పశ్చిమదేశాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తమ దేశంలో ఎన్నికల తరువాత నెలకొన్న అశాంతికి అమెరికానే కారణమని, ఇందులో అమెరికానే విలన్ అని అహ్మదీనెజాద్ ఆరోపించడాన్ని అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా, పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయని, తమ దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తున్నాయని నెజాద్ ఆరోపించారు.

నెజాద్ వ్యాఖ్యలపై వైట్‌హోస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ మాట్లాడుతూ.. తమ దేశంలో పరిస్థితులకు అమెరికా, పశ్చిమ దేశాలే కారణమని వాదించే ఇరానీయన్లు చాలామంది ఉన్నారని, వారిలో అహ్మదీనెజాద్ కూడా ఒకరని వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి