పాకిస్థాన్ తర్వాత భారతదేశమే మా తదుపరి టార్గెట్ అని తాలిబన్ చీఫ్ హకీముల్లా మెహసూద్ గురువారం అన్నారు.
పాకిస్థాన్ దేశం తర్వాత తమ తదుపరి టార్గెట్ భారతదేశమేనని తాలిబన్ చీఫ్ హకీముల్లా మెహసూద్ అన్నారు. ముందుగా పాకిస్థాన్ దేశంలో ప్రత్యేక ఇస్లామిక్ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక ఇస్లామిక్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తాము పాక్ సరిహద్దుల్లోకి వెళ్ళి భారతీయులతో పోరాడుతామని ఆయన ఓ వార్తా సంస్థకు తెలిపారు.
గత కొద్ది వారాలుగా పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని, పాక్ భద్రతా దళాలకు చెందిన ప్రధాన కార్యాలయాలపై జరిగిన దాడులు కూడా తమ వారే చేశారని ఆయన ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
తమ పోరాటం కేవలం పాకిస్థాన్ పోలీసులు, మిలిటరీపైనేనని, వారు అమెరికా దేశానికి మోకాలొడ్డుతున్నారని ఆయన అన్నారు. ఎప్పుడైతే పాక్ పోలీసులు, సైన్యం అమెరికా సూచనలు పాటించడం మానేస్తారో, అప్పుడే తాము పాకిస్థాన్‌లో పోరాటం చేసేది ఆపేస్తామని హకీముల్లా తెలిపారు.
ఇదిలావుండగా ఆగస్టు నెలలో వజీరిస్థాన్‌లో తహరీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ బైతుల్లా మహసూద్‌ను అమెరికా డ్రోన్ దాడుల్లో హతమార్చిన తర్వాత హకీముల్లాను ఈ సంస్థకు చీఫ్‌గా నియమించినట్లు తాలిబన్ ప్రకటించింది.