పార్లమెంట్‌ను రద్దు చేసిన జపాన్ ప్రధాని

జపాన్ ప్రధానమంత్రి టారో అసో మంగళవారం ఈ దేశ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో ఆగస్టు 30న జపాన్‌లో సాధారణ ఎన్నికలకు మార్గం సుగమమైంది. తాజా ఎన్నికల్లో గత 50 ఏళ్లుగా దేశంలో తిరుగులేని శక్తిగా ప్రజల మన్ననలు అందుకున్న అధికార పార్టీ పరాజయం పాలైయ్య అవకాశం ఉన్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సభ్యులకు పార్లమెంట్‌ను రద్దు చేస్తున్న సందర్భంగా అసో క్షమాపణ కూడా చెప్పారు. ప్రజల్లో పార్టీకి విశ్వాసం సడలుతుండటం పట్ల ఆయన మాట్లాడుతూ తన సహచరులకు క్షమాపణ తెలిపారు.

ఇటీవల కాలంలో వచ్చిన సర్వేలన్నీ అధికార పార్టీకి చాలా ప్రతికూలంగా వచ్చాయి. ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (డీపీజే) ఆగస్టు 30న జరిగే ఎన్నికల్లో విజేతగా నిలుస్తుందని సర్వేలతోపాటు, రాజకీయ నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. టోక్యో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ పరాజయం అనంతరం ఈ సర్వేల వాదనలు మరింత బలపడ్డాయి.

వెబ్దునియా పై చదవండి