రష్యా, చైనా, టర్కీ, భారత్‌లు కీలకమైన అంతర్జాతీయ శక్తులుగా ఎదుగుతున్నాయని అమెరికా గుర్తించింది. వాతావరణ మార్పులు, తీవ్రవాదం, ఆర్థిక మాంద్యం, నిరాయుధీకరణ వంటి కీలక అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అమెరికా ఈ దేశాలతో భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని అమెరికా కోరుకుంటోంది.
చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి ప్రధాన, వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ శక్తులపై అమెరికా ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ దేశాలతో అమెరికా పూర్తి భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటుందని చెప్పారు.
తాను వ్యక్తిగతంగా ఇందుకు కట్టుబడి పనిచేస్తానని, దీనికి సంబంధించిన ప్రక్రియకు ప్రాముఖ్యత కల్పించాలనుకుంటున్నట్లు హిల్లరీ తెలిపారు. అంతర్జాతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కీలక సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ఈ దేశాల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ శుక్రవారం నుంచి భారత్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.