బాగ్దాద్‌లో బాంబు దాడి: 56 మంది మృతి

ఇరాన్ రాజధాని బాగ్దాద్‌లో రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో సంభవించిన బాంబు పేలుడులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. కూరగాయల బండిలో దాచి ఉంచిన బాంబు సదర్ ప్రాంతంలోని మార్కెట్‌లో పేలింది. ఈ ప్రాంతాల్లో షియా వర్గీయులు అధికంగా నివసిస్తున్నారు. ఈ జిల్లాలో అమెరికా మిలిటరీ ప్రధాన స్థావరాన్ని మూసివేసిన కొన్ని రోజులకే ఈ బాంబు దాడి జరిగింది.

బాంబు పేలుడులో 56 మంది మృతి చెందగా, వంద మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఇరాక్‌లో ఎక్కువ ప్రాణనష్టం జరిగిన బాంబు దాడుల్లో ఇది మూడోవది. ఇరుదేశాల మధ్య కుదిరిన తాజా భద్రతా ఒప్పందం ప్రకారం అమెరికా మిలిటరీ ఇరాన్‌‍లోని నగరాలను ఇరాకీ సేనలకు అప్పగిస్తోంది.

దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే ఈ బాంబు దాడి జరిగింది. బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో మార్కెట్ బాగా రద్దీగా ఉందని, అందువలనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి