భారత్- పాక్ చర్చల షెడ్యూల్ ఖరారు కాలేదు

భారత్- పాకిస్థాన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ పునరుద్ధరించేందుకు షెడ్యూల్ ఖరారు కాలేదని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ చెప్పారు. సల్మాన్ బషీర్ ఈజిప్టులో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్‌తో సమావేశమయ్యారు. ముంబయి ఉగ్రవాద దాడులు, తీవ్రవాదంపై ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు తాజా సమావేశంలో చర్చలు జరిపారు.

మంగళవారం సాయంత్రం 90 నిమిషాలపాటు జరిగిన ఈ చర్చల అనంతర బషీర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య చర్చల పునరుద్ధరణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. చర్చల పునరుద్ధరణ షెడ్యూల్‌ను ఆశించడం ఇప్పుడే సాధ్యపడదన్నారు.

ఇదిలా ఉంటే ఇరుదేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు బుధవారం సాయంత్రం మరోసారి సమావేశం కానున్నారు. అనంతరం గురువారం ఉదయం 10.30 గంటలకు భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, యూసఫ్ రజా గిలానీ మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈజిప్టులో జరిగే అలీనోద్యమ దేశాల సదస్సులో భాగంగా ఇరుదేశాల మధ్య ద్పైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి