మహాత్మునిపేరిట తపాలాబిళ్ళను విడుదల చేసిన ఐరాస

జాతిపిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 140వ జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీన ఐక్యరాజ్యసమితి మహాత్మునిపేరిట ఓ తపాలాబిళ్ళను విడుదల చేసింది.

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ తపాలాబిళ్ళ ధర ఒక డాలరు. మియామీకి చెందిన ప్రముఖ కళాకారుడు ఈ తపాలాబిళ్ళను రూపొందించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ తపాలాబిళ్ళలో జాతిపిత బొమ్మను ఎరుపు, నీలం మరియు బంగారు వర్ణాలతో చిత్రీకరించబడి ఉంది.

భారతీయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతిపిత జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఐక్యరాజ్య సమితిలో పలు పదవులు అలంకరించిన వారు, అనేక దేశాల దౌత్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితిలో భారతదేశపు దౌత్యాధికారిగానున్న హరదీప్ సింగ్‌ పురీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐక్యరాజ్యసమితిలోని ప్రతి పనిలో కూడా మహాత్ముడు చెప్పిన సూత్రాలే ఎక్కువగా ఉంటాయని, వాటినే ఇక్కడ అమలు చేస్తుంటారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అలీ త్రేకీ మాట్లాడుతూ... ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య సత్సంబంధాలను కొనసాగించడంలో మహాత్మాగాందీ సిద్ధహస్తులని ఆయన బాపూజీని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికాకు చెందిన మరో దౌత్యాధికారి సుజైన్ రైస్ మాట్లాడుతూ... మహాత్మాగాంధీ లక్షలమంది అమెరికన్లను ప్రభావితం చేశారని కొనియాడారు. గాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి నైతికబలమే చివరికి విజయం సాధిస్తుందని దౌత్యాధికారి రైస్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి