పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ రెండో రోజు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రెండేళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించడంతోపాటు, న్యాయముర్తుల తొలగింపుకు సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయాల న్యాయబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలిస్తోన్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన జరుగుతున్న కోర్టు విచారణకు హాజరుకావాలని ఇటీవల పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం ముషారఫ్‌కు నోటీసు జారీ చేసింది. బుధవారం ముషారఫ్ కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆయనగానీ, ఆయన తరపు న్యాయవాదిగానీ ఎవరూ రాలేదు. గురువారం కూడా ముషారఫ్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో.. ఆయనపై కఠినమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. పర్వేజ్ ముషారఫ్ ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.