సార్వభౌమ సమానత్వం, విశ్వాస ఆధారిత సూత్రాలపై అమెరికాతో సంబంధాలు ఆధారపడివున్నాయని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు.
సెనేటర్లు రాబర్ట్ పీ కేసే, షెల్డన్ వైట్‌హౌస్, మైకెల్ బెన్నెట్, రిచర్డ్ బ్లూమెంథాల్‌లతో కూడిన అమెరికా విధానకర్తల ప్రతినిధుల బృందం ఆదివారం భేటి ఆయిన సందర్భంగా జర్దారీ మాట్లాడుతూ ఏకపక్ష చర్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.
ప్రాంతీయ, అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రాంత సుస్థిరతకు ఇరుదేశాలు కలిసిపనిచేయవలసిన ఆవశ్యకతను తెలియజేశాయని జర్దారీ పేర్కొన్నారు. తీవ్రవాదంపై పోరాటంలో అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ ప్రజలు, సంస్థలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పాక్ అధ్యక్షుడు నొక్కిచెప్పారు. మే2న అబోట్టాబాద్‌లో అల్‌ఖైదా ఛీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సీల్స్ హతమార్చిన తర్వాత అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు కొంతమేర క్షీణించాయి.