పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం నిషేధిత జమాదుత్ దవా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను కొన్ని వారాల క్రితం లాహోర్ హైకోర్టు గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సయీద్‌ను గృహ నిర్బంధంలో ఉంచేందుకు పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం బలమైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో లాహోర్ హైకోర్టు ఆయనను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడులకు సయీద్ ప్రధాన సూత్రధారి అని భారత్ బలంగా విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే.
సయీద్ విడుదల కావడంపై భారత్‌తోపాటు, పలు దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావీన్స్, పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వాలు సయీద్ విడుదలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రెండు పిటిషన్లపై సోమవారం విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు సయీద్‌ను నిర్బంధంలో ఉంచేందుకు బలమైన ఆధారాలు ప్రవేశపెట్టాలని కోరింది.
తాజాగా సరైన ఆధారాలు లేకపోవడంతో పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. పంజాబ్ ప్రావీన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరలో ఇరుదేశాల మధ్య జరగబోతున్న చర్చల్లో ప్రధానాంశమయ్యే అవకాశం ఉంది. నామ్ సదస్సుకు ముందుగా ఈజిప్టులో జరిగే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్, పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి సల్మాన్ బషీర్ మధ్య చర్చలు జరగనున్నాయి.