భారత్-పాకిస్థాన్ దేశాల ప్రధానులు గురువారం ఈజిప్టులో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ముంబై దాడుల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే.. భారత్ ఒక మెట్టు దిగి.. కీలకమైన ముంబై పేలుళ్ళ ప్రస్తావనే లేకుండా గిలానీతో ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చలు జరిపారు. దీనితో కేవలం ద్వైపాక్షిక సంబంధాల ఎజెండాతోనే ఇరువురు ప్రధానుల మధ్య చర్చలు జరిగాయి.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ చర్చలో పలు ద్వైపాక్షిక అంశాలపై వీరిద్దరు చర్చించారు. అనంతరం ఇరువురు ప్రధానులు మీడియా ముందుకు వచ్చారు. ఇరుదేశాలకు ఉగ్రవాదం ప్రధాన శత్రువని ఉమ్మడి ప్రకటన చేసి సరిపుచ్చుకున్నారు. ముంబై పేలుళ్ళ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో ఆ అంశాన్ని కాస్త పక్కన పెట్టాలని పాక్ పదే పదే చేసిన ప్రతిపాదనకు భారత్ మెత్తబడినట్టు తెలుస్తోంది.
అంతకుముందే గిలానీ ప్రతిపాదనను ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ బషీర్, ఎస్.ఎం.కృష్ణను కలిసి చర్చించగా, మన్మోహన్ను సంప్రదించి కృష్ణ ఇందుకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మన్మోహన్, గిలానీ కలిసి చర్చలు ప్రారంభించారు. ఈ సమావేశానికి ముందు భారత్-పాక్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.