మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ ఎదుర్కొంటున్న కోర్టు విచారణ ఇటీవల ముగిసింది. ఆమె కేసులో తీర్పు శుక్రవారం వెలువడాల్సివుంది. అయితే ఈ కేసులో కోర్టు తీర్పు ఆగస్టు 11న వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వాధికారులు తెలిపారు. కోర్టు విచారణ ఎందుకు వాయిదా పడిందో కారణాలు అధికారులెవరూ వెల్లడించలేదు.
సుకీ కేసుపై జరుగుతున్న విచారణకు జర్నలిస్ట్‌లు అనుమతించడం లేదు. కొందరు అంతర్జాతీయ దౌత్యాధికారులను మాత్రం విచారణకు అనుమతిస్తున్నారు. 64 ఏళ్ల ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత గృహ నిర్బంధ నియమాలను ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మయన్మార్ మిలిటరీ పాలకులు సూకీపై కేసు పెట్టారు.
చాలా ఏళ్ల నుంచి గృహ నిర్బంధంలో ఉంటున్న సూకీ దీనికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారని ఈ ఏడాది మేలో కేసు నమోదయింది. గృహ నిర్బంధం నియమాలకు విరుద్ధంగా ఓ అమెరికన్ పౌరుడు సూకీ ఇంటిలో రెండు రాత్రులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో సూకీ ప్రమేయం నిరూపించబడితే ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. గత 20 ఏళ్లలో సూకీలో 14 ఏళ్లపాటు గృహ నిర్బంధంలోనే ఉండటం గమనార్హం.