హక్కానీని శాంతి చర్చలకు తీసుకువస్తాం: పాకిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా సంకీర్ణ దళాలకు పెద్ద ముప్పుగా ఉన్న సంచలనాత్మక తీవ్రవాద సంస్థ హక్కానీ మిలిటెంట్ నెట్‌వర్క్‌‌ను చర్చలకు తీసుకొస్తామని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో దాక్కొని దాడులు చేస్తున్న హక్కానీ గ్రూప్‌పై పాకిస్థాన్ సైనిక చర్యకు దిగాలని అమెరికా చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నది.

తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న హక్కానీ గ్రూప్‌ ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక భారీ దాడులు చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ కేంద్రంగా దాడులకు పాల్పడింది. ఈ మూడు తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్ గిరిజన ప్రాంతం ఉత్తర వజిరిస్థాన్‌ నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసే హక్కానీ గ్రూప్‌ నాయకుడు జలాలుద్దీన్ హక్కానీతో పాకిస్థాన్ బహిరంగంగానే సమాచార మార్పిడి చేస్తున్నది. కాగా ఈ తీవ్రవాద సంస్థకు ఇస్లామాబాద్ ఆర్ధిక, ఆయుధ సాయాన్ని అందిస్తున్నట్లు అమెరికా, ఆఫ్ఘనిస్థాన్‌లు చేస్తున్న ఆరోపణలపై మాట్లాడటానికి పాకిస్థాన్ సైన్యం నిరాకరించింది.

వెబ్దునియా పై చదవండి