హజారే ఉద్యమంతో భారత్‌ను అస్థిరపరచం: యుఎస్

శుక్రవారం, 19 ఆగస్టు 2011 (09:10 IST)
సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌ను అస్థిరపరచబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌ను తాము అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్న అపోహను సృష్టించేందుకే అన్నా హజారే ఉద్యమంపై తాము చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అమెరికా వివరణ ఇచ్చింది. శాంతియుత భావ వ్యక్తీకరణ, అహింసాత్మక నిరసన వంటి ఆందోళన రూపాలను ప్రపంచంలో ఎక్కడైనా తాము సమర్థిస్తూనే ఉంటామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి విక్టోరియా న్యూలాండ్‌ చెప్పారు.

భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే సాగిస్తున్న ఉద్యమంపై తాము చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. హజారేను సమర్థిస్తూ తాము విడుదల చేసినట్లు చెబుతున్న ప్రకటన వాస్తవానికి తాము విడుదల చేసింది కాదని ఆమె వివరించారు. హజారేను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయటం ద్వారా భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందన్న కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ అమెరికా ఈ వివరణ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి