ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లలో ఓపెనర్ షేన్ వాట్సన్ 39, అంబటి రాయుడు 12, కెప్టెన్ ధోనీ 33, శామ్ బిల్లింగ్స్ 27 పరుగులు చేయగా, సురేశ్ రైనా 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధీ ఓ వికెట్ నేలకూల్చాడు.
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ విజృంభిచాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ రెండు సిక్సర్లు బాదడంతో విజయం రాజస్థాన్ వైపు మళ్లినా చివరి బంతికి అతడు అవుటవడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
చివరి ఓవర్లో మూడు బంతులకు 10 పరుగులు చేయాల్సిన తరుణంలో బ్రావో వేసిన మూడో బంతికి రెండు పరుగులు సాధించిన బట్లర్ తర్వాతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు రావడంతో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.