ఐపీఎల్ 2020 : పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు... చెన్నై ఖాతాలో విజయం

సోమవారం, 5 అక్టోబరు 2020 (09:27 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన 18వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తన ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు నిర్ధేశించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా అలవోకగా ఛేదించింది. ఫలితంగా చెన్నై ఖాతాలో రెండో విజయం నమోదైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లకు చెన్నై ఓపెనర్లు చుక్కలు చూపించారు. 
 
రాహుల్ 52 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేయగా, మయాంక్ 26, మన్‌దీప్ 27, పూరన్ 33 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ 11, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఓపెనర్లే బాదేశారు. షేన్ వాట్సన్, ఫా డుప్లెసిస్‌లు చెలరేగి ఆడారు. పోటాపోటీగా పరుగులు తీస్తూ పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టారు.
 
వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పంజాబ్ కెప్టెన్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏమాత్రం ప్రభావం చూపని బౌలర్లు పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. వికెట్లు తీసేందుకు చెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది.
 
పొరపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని వాట్సన్, డుప్లెసిస్‌లు సమయోచితంగా ఆడుతూ జట్టుకు ఘన విజయం అందించారు. వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, డుప్లెసిస్ 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు.
 
దీంతో చెన్నై జట్టు మరో రెండు ఓవర్ల రెండు బంతులు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. 5 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది రెండో విజయం. షేన్ వాట్సన్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు