ఆల్‌రౌండర్ పదానికి అర్థం చెప్పిన హార్దిక్ పాండ్య: చివరి ఓవర్లో వీర విహారం

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (02:59 IST)
ఐపీఎల్ 10 సీజన్‌లో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను పుణే జట్టుకు కోల్పోయినప్పటికీ ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్య బ్యాట్‌తో చేసిన అద్బుత ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ముంబై ఇండియన్స్ జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు పార్థీవ్‌ పటేల్‌(19), జోస్‌ బట్లర్‌(38), రోహిత్‌ శర్మ(3) వికెట్లను తన తొలి రెండు ఓవర్లలోనే తీసి పుణె స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేశాడు. అయినప్పటికీ చివరలో వచ్చిన పాండ్య(35) ఆఖరి ఓవర్‌లో ఏకంగా 30పరుగులు సాధించడంతో ముంబయి 184 పరుగులు చేయగలిగింది. పుణె బౌలర్లలో తాహిర్‌ ఒక్కడే మూడు వికెట్లు తీసి అబ్బుర పరిచాడు.
 
ఇన్నింగ్స్ 16 ఓవర్ లో్ నితీష్ రానా ఆరో వికెట్ గా అవుటైన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా తొలుత నెమ్మదిగా  ఆడాడు. తొలి తొమ్మిది బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన పాండ్యా.. ఆఖరి ఓవర్ లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 20.0 ఓవర్ లో 28 పరుగులు పిండుకుని ముంబైను పటిష్ట స్థితికి చేర్చాడు. పుణె బౌలర్ అశోక్ దిండా వేసిన చివర ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఫోర్ తో స్కోరును పరుగులు పెట్టించాడు. ఇందులో వరుసగా కొట్టిన మూడు సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి.
 
హార్దిక్ పాండ్యా కేవలం 15 బంతుల్లో 35 నాటౌట్‌తో నిలిచి ప్రేక్షకులను అలరించడమే కాకుండా జట్టుకు గౌరవప్రదమైన స్థితిలో నిలిపాడు. దురదృష్టవశాత్తూ పుణె కెప్టెన్ స్మిత్, అజంక్యా రహానే అద్బుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నప్పటికీ ఆల్ రౌండర్ అనే పదానికి అర్థం తెలిపిన హార్దిక్ పాండ్యా అందరి హృదయాలనూ గెల్చుకున్నాడు
 

వెబ్దునియా పై చదవండి