కాలానుగుణంగా, శాస్త్రసాంకేతిక రంగాలలో వస్తున్న ఆశాజనక పరిణామాలతో మానవుడు ముందుకు సాగుతున్న వైనం అందరికీ తెలిసిందే. దేశగతిని మలుపుతిప్పే సాంకేతిక ఆవిష్కరణలో సైతం ముహూర్తాలను చూసుకునే అంతుపట్టని ఆచారం, మూఢ నమ్మకం మరియు ఆధునికతల సంధి యుగంలో మనం జీవన యానం సాగిస్తున్నాం.
ఈ నేపథ్యంలో తాను చూసాను అనుకుంటున్నది నిజమో అబద్ధమో తేల్చుకోలెని అయోమయ పరిస్థితిలో విశ్వాసానికి, విజ్ఞానానికి మధ్య ఊగిసలాడుతున్న యువకుని మానసిక స్థితిని 'ఇదీ సంగతి'లో అందిస్తున్నాము.
నవంబర్ 23, 2007... రాత్రి తొమ్మిది గంటలయ్యింది. మధ్యాహ్నం షిఫ్ట్‌కు వచ్చిన ప్రసాద్ ఆఫీసులో కూర్చుని సీరియస్‌గా పని చేసుకుంటున్నాడు. అదేసమయంలో ప్రసాద్ సెల్ ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేశాడు ప్రసాద్. అవతల్నుంచి సుబ్బారావు మామయ్య మాట్లాడుతున్నారు. "హలో ప్రసాద్.. ఎక్కడున్నావ్?" "ఆఫీసులో ఉన్నాను." సమాధానమిచ్చాడు ప్రసాద్. "అయితే వెంటనే బయటకు వెళ్ళి చందమామను చూడు... సత్యసాయిబాబా కనపడతాడు." మామయ్య చెపుతున్నది ప్రసాద్‌కు అర్ధం కాలేదు. "చందమామ ఏంటీ... సత్యసాయిబాబా కనపడటం ఏంటీ...ఏంటి మామయ్య సరిగా చెప్పు..." గట్టిగా అడిగాడు ప్రసాద్. "అర్జెంట్‌గా వెళ్ళి చందమామను చూడు.. నీకే అర్థమవుతుంది.. ఉంటాను.." మామయ్య ఫోన్ డిస్కనెక్ట్ చేశారు.
File
FILE
కొలిగ్‌తో పాటు రోడ్డు మీదకు వచ్చాడు ప్రసాద్. చందమామను చూసిన ప్రసాద్‌కు నోటమాట రాలేదు. చందమామలో అర్థచంద్రాకారంలో నల్లని భాగం కమ్మేసి ఉంది. ఇంకా చెప్పాలంటే... అది సత్యసాయిబాబా తలకట్టును పోలి ఉంది. మరింత నిశీతంగా చూసిన ప్రసాద్‌కు సాయిబాబా ముఖ బింబం లీలగా కనిపించింది. "ఎక్కడరా సాయిబాబా" అడిగాడు అతని కొలిగ్. అనేక రకాలుగా చెప్పి చూసాడు ప్రసాద్. కానీ కొలిగ్ నమ్మలేదు. "ఊరుకోరా కబుర్లు చెపుతావు. అదంతా చంద్రునిపైన ఉండే కొండలు గుట్టలు.. ఇంకా చెప్పాలంటే.. మన చిన్నప్పుడు చందమామలో అవ్వ తిరగలిలో పిండిని తయారు చేస్తుంటుంది చూడు అని మన తాతయ్యలు, బామ్మలు చెప్తుంటారు చూడు.. ఇది కూడా అలాంటిదే.." ప్రసాద్ మట్టుకు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. తన కొలిగ్ చెప్తున్నది కరక్టేనేమో.. తానేమైనా భ్రమకు గురయ్యానా? వెంటనే తన బావకు ఫోన్ చేశాడు. "బావా! చందమామలో సత్యసాయిబాబా కనపడుతున్నాడు చూడు" అటు నుంచి పెద్దగా నవ్వు వినపడింది. "అచ్చా! చందమామలో సాయిబాబా కనపడుతున్నాడా? ఏదీ నాకేం కనపడటం లేదే?" మళ్ళీ అదే స్థాయిలో నవ్వు పునరావృతమయ్యింది. "ఒకే బావా ఉంటాను." ఫోన్ కట్ చేసి ఆకాశంలోకి చూశాడు ప్రసాద్.
File
FILE
చందమామలో సాయిబాబా తనను చూసి నవ్వుతున్నట్లనిపించింది. ఇలా కాదు తన క్లోజ్ ఫ్రెండ్ సురేష్‌కు ఫోన్ చేసి చెప్పాడు. "రేయ్ ప్రసాద్... ఇంకాస్త పరిశీలనగా చూడరా... నువ్వు కూడా చందమామలో కనపడతావు" అట్నుంచి సురేష్ వేళాకోళాలాడటం మొదలు పెట్టాడు. మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు ప్రసాద్. ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి మేడ మీదకు వెళ్ళారు. "అవునండీ.. సత్యసాయిబాబా ఆకారం అవుట్ లైన్‌గా కనపడుతోంది." తనను బాధపెట్టడం ఇష్టంలేక ఆమె అలా చెప్పిందేమో.. అని అనిపించింది ప్రసాద్‌కు.. ఈలోగా సుబ్బారావు మామయ్య నుంచి ఫోన్ "రేయ్ ప్రసాద్.... దుబాయ్‌లో సుబ్బారావుకు, హైదరాబాద్‌లో సునీత వాళ్ళ ఫ్యామిలీకి కూడా చందమామలో సత్యసాయిబాబా కనిపించాడని చెప్పార్రా.. ఇంతకీ నీకు కనిపించారా?" "చూశాను మామయ్య.." "నువ్వు కూడా మాలాగే అదృష్టవంతుడివిరా..." ఫోన్ పెట్టేశాడు మామయ్య. ఆకాశంలోకి చూసాడు ప్రసాద్. చందమామలో ఆకారం కొద్ది కొద్దిగా మారుతున్నట్లనిపించింది. నిజమా లేక మనస్సు భ్రాంతికి గురవుతున్నదో తేల్చుకోలేని మానసిక డోలాయమానంలో నిద్రకు ఉపక్రమించాడు ప్రసాద్.