పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై...

శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:46 IST)
ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్‌బుక్ పేరు మారింది. పేస్‌బుక్ పేరును మెటాగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా వెల్లడించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారబోతోందంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గురువారం దాని పేరు అధికారికంగా మారిపోయింది.
 
పేరు మార్పునకు గల కారణాలను జుకర్‌బర్గ్ వివరిస్తూ.. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతిక (మెటావర్స్)కు ప్రాధాన్యం పెరగబోతోందని, దానిని దృష్టిలో పెట్టుకునే ఫేస్‌బుక్ సంస్థ పేరును ‘మెటా’గా మార్చినట్టు పేర్కొన్నారు. 
 
ఈ సంస్థ అధీనంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నప్పటికీ వాటి పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. వీటి మాతృసంస్థ పేరు మాత్రమే మారినట్టు చెప్పారు.
 
వచ్చే దశాబ్ద కాలంలో మెటావర్స్ వేదిక వంద కోట్ల మందికి అందుబాటులోకి వస్తుందని, ఈ విధానంలో ప్రజలు కలుసుకుని, పనిచేసి, ఉత్పత్తులను తయారుచేస్తారని జుకర్‌బర్గ్ తెలిపారు. లక్షలాదిమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
 
ప్రస్తుతం తమ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, క్వెస్ట్ వీఆర్ హెడ్‌సెట్, హొరైజన్ వంటివి భాగంగా ఉన్నాయని, వీటన్నింటినీ ఫేస్‌బుక్ పేరు ప్రతిబింబించడం లేదని అన్నారు. పేరు మారినా చేసే పని మాత్రం అదేనని ఆయన వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు