ఈ-కామర్స్ దిగ్గజాలు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానం, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999లను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థలపై దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)లను ఆదేశించింది.
అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ మన దేశంలోని చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అనేక ఫిర్యాదులు చేసింది. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ ఎఫ్‌డీఐ విధానాన్ని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఏఐటీ అనేక ఫిర్యాదులు చేసింది. దీంతో వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్ట్‌మెంట్ స్పందించింది.
ఈడీ, ఆర్బీఐలకు లేఖలు రాసింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందంలో ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘన జరిగిందని సీఏఐటీ ఆరోపించింది.