సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో టీనేజర్లకు సురక్షితమైన వాతావరణం అందించేందుకు ఇన్స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను చేర్చింది. 18 ఏళ్లలోపు టీనేజర్లకు అడల్ట్స్ సందేశాలను పంపకుండా నిరోధించే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో, ఇకపై ఎవరైనా తమను ఫాలో చేయని టీనేజర్స్‌కు అడల్డ్స్ మెసేజ్ చేసే అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన భద్రతా ఫీచర్‌ను చేర్చింది.
మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ సహాయంతో ఈ ఫీచర్ రూపొందించింది ఇన్స్టాగ్రామ్. అయితే, సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో సైన్అప్ చేసేటప్పుడు వారి వయస్సు వివరాలు కోరుతుందన్న విషయం తెలిసిందే. అయితే, కొంత మంది టీనేజర్స్ ఎక్కువ వయసును నమోదు చేసి అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు.
దీంతో, ఇలాంటి ఫేక్ అకౌంట్లను నిరోధించేందుకు, వారి అసలు వయస్సును నిర్థారించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రస్తుతం 1 బిలియన్కు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు.
2017లో ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసెంజర్ కూడా 6 నుండి -12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం మెసెంజర్ కిడ్స్ అనే చాట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పిల్లల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన 'మెసెంజర్ కిడ్స్' ప్లాట్ఫార్మ్కు వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు ఫేస్బుక్ చూపు తన దృష్టి ఇన్స్టాగ్రామ్ యాప్‌పై పెట్టిన సంగతి తెలిసిందే.