జియో యూజర్లకు షాక్... రూ.4500లకు రీచార్జ్ చేస్తేనే రూ.1500 రీఫండ్

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (09:41 IST)
జియో 4జి ఫీచర్ ఫోన్‌ను బుక్ చేసుకుని, దానికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వినియోగదారులకు రిలయన్స్ జియో భారీ షాకిచ్చింది. జియో 4జీ ఫోన్‌కు సంబంధించి నిబంధనలు, షరతులను సం‍స్థ ప్రకటించింది. కస్టమర్లపై ఆశలపై నీళ్లు చల్లుతూ కొన్ని షాకింగ్‌ నిబంధనలు, మాండేటరీ రీచార్జ్‌ల బాదుడుకు శ్రీకారం చుట్టింది. కనీస రీఛార్జిలు, ఫోన్‌ రిటర్న్ విధానాన్ని కంపెనీ వెబ్‌సైట్‌‌లో పేర్కొంది.
 
ముఖ్యంగా జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా కస్టమర్‌ డిపాజిట్‌  చేసిన రూ.1500 సొమ్ము తిరిగి పొందాలంటే మూడు సంవత్సరాల్లో కనీసం రూ.4500 విలువైన రీచార్జ్‌ చేసుకోవాలి. ఇలా తప‍్పనిసరిగా రీచార్జ్‌ చేసుకోవాలి లేదంటే.. వినియోగదారుడికి భారీ నష్టం తప్పదు. 
 
మూడు నెలల పాటు ఎలాంటి రీచార్జ్‌లు చేసుకోకుండా వుంటే రావాల్సిన రిఫండ్‌ మనీ రూ.1500 వెనక్కి రాదు. అలాగే మూడేళ్ల పాటు సంవత్సరానికి ఖచ్చితంగా రూ.1500 (మొత్తం రూ.4500) విలువైన రీచార్జ్‌ ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే. ఒకవేళ మధ్యలోనే జియో ఫోన్‌ వెనక్కి ఇచ్చేయాలని  ప్రయత్నిస్తే మరో బాదుడు తప్పదు. ఎందుకంటే దీనికి అదనంగా పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుందట. ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలలలోపు దాన్ని రిటర్న్ చేస్తే రూ.1500, ప్లస్ జీఎస్‌టీ పెనాల్టీగా చెల్లించాలట. 
 
ఒకవేళ మొదటి సంవత్సరం వాడుకుని రెండో సంవత్సరం దాన్ని రిటర్న్ చెయ్యాలనుకుంటే రూ.1000 రూపాయలు ఫైన్‌‌గా కట్టాలి. దీనికి జీఎస్టీ అదనం. మూడో సంవత్సరం 36 నెలలు పూర్తయ్యే లోపు రిటర్న్ చెయ్యాలంటే రూ.500 ఫైన్ కట్టాలి. దీని కూడా జీఎస్టీ అదనం. ఈ నిబంధనలకు లోబడి వినియోగదారుడు చెల్లించిన రూ.1500 తిరిగి వస్తాయి. ఈ వివరాలన్నీ జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ నిబంధనలు చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు