8 భారతీయ భాషల్లో జియోపేజెస్ పేరిట సరికొత్త బ్రౌజర్

గురువారం, 22 అక్టోబరు 2020 (11:55 IST)
రిలయన్స్ జియో మరో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. జియోపేజెస్ పేరిట ఓ సరికొత్త బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో విడుదల చేసిన బ్రౌజర్‌కు ఇది అప్‌డేటెడ్ వర్షన్. ఇది 8 భారతీయ భాషల్లో లభ్యమవుతుందని, మరింత మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని ఇస్తుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదేసమయంలో వ్యక్తిగత సమాచార గోప్యతకూ పెద్దపీట వేస్తుందన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఈ బ్రౌజర్‌లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయన్నారు. వీడియోల స్ట్రీమింగ్ వేగంగా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 
 
ఇక ఈ బ్రౌజర్ ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంటుందని, 'జియోపేజెస్'లో యూజర్లు తమకు నచ్చిన, కావాల్సిన కంటెంట్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చన్నారు. 
 
ఏ రాష్ట్రంలోని వారికి ఆ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన సైట్లు తొలుత కనిపిస్తాయని, అవసరమని భావించినవారు గూగుల్, బింగ్ వంటి సెర్చ్ సైట్లను డిఫాల్ట్ సెర్చింజన్లుగా మార్చుకోవచ్చన్నారు. ఇక తన పాత బ్రౌజర్‌ను వాడుతున్న దాదాపు 1.40 కోట్ల మందినీ కొత్త బ్రౌజర్‌కు అప్‌డేట్ చేస్తామని జియో తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు