వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ మొబైల్ ఫోన్ పేలిపోయింది.. కారణం ఏంటంటే?

గురువారం, 5 ఆగస్టు 2021 (08:59 IST)
OnePlus Nord 2
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్‌ 2 5జీ మొబైల్ ఫోన్ పేలి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అంకూర్‌ శర్మ అనే వ్యక్తి తన భార్య కోసం ఐదు రోజుల క్రిందట వన్ ప్లస్ నార్డ్‌ 2 5జీ మొబైల్ కొన్నారు. ఆమె ఫోన్‌ను హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచి సైక్లింగ్ చేస్తుండగా మొబైల్ పేలిపోయింది. భార్య ద్వారా ఈ విషయం తెలుసుకున్న అంకూర్‌ పేలిపోయిన మొబైల్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు పేలిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాగే శామ్‌సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ నోట్ 7 పేలిపోయింది. అయితే తాజాగా వన్‌ప్లస్ పేలిపోవడంతో సామ్‌సంగ్ మొబైల్ సంఘటనను నెటిజన్లు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో శామ్‌సంగ్ కంపెనీ ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. తమ వినియోగదారులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించిన సంస్థ అన్ని గెలాక్సీ నోట్ 7 డివైజ్‌లను తిరిగి తీసుకుంటామని ప్రకటించింది. 
 
అంతేకాకుండా, వినియోగదారురు ఎంత డబ్బులు చెల్లించి నోట్ 7 ఫోన్‌ కొన్నారో.. అంత డబ్బులు ఇచ్చేసి ఫోన్ లను వెనక్కి తిరిగి తీసుకుంటామని వెల్లడించింది. తాజాగా శామ్‌సంగ్ బాటలోనే వన్‌ప్లస్ కూడా నడుస్తుందని అందరూ భావించారు. ఫోన్ పేలిన ఘటనపై వన్‌ప్లస్ ఎలా స్పందిస్తుందా.. అని చాలా మంది నెటిజన్లు వేచి చూశారు. కానీ వన్‌ప్లస్ చాలా భిన్నంగా స్పందించింది.
 
మొదట బాధిత మొబైల్ వినియోగదారుడిని సంప్రదించింది. కొంత సమయం తర్వాత ఘటనకు సంబంధించి బాధిత యూజర్ పెట్టిన ట్వీట్ డిలీట్ అయ్యింది. అయితే ఈ క్రమంలోనే వన్‌ప్లస్ స్పందించి డైరెక్ట్ మెసేజ్ యూజర్‌ని సంప్రదించింది. అనంతరం ఫోన్ బ్లాస్ట్ ఘటనపై దర్యాప్తు చేసింది. తరువాత అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
 
'కస్టమర్ల హెల్త్, సేఫ్టీకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మేము బాధిత వినియోగదారుడిని సంప్రదించాం. ఈ ఘటనపై అంతర్గత విచారణ కూడా జరిపాం. విచారణ ఫలితాల్లో ఫోన్ పేలిపోవడం అనేది బయట కారకాల వల్లనే జరిగిందని తేలింది. 
 
తయారీ లోపం మొబైల్ పేలిపోవడానికి కారణం కాదని తేలింది. స్మార్ట్‌ఫోన్ల నాణ్యత, భద్రతకు సంబంధించిన అన్ని టెస్టులు జరిపిన తర్వాతే మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం' అని కంపెనీ పేర్కొంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు