అమెరికాతో అణు ఒప్పందం చేసుకుంటే భారత్ సార్వభౌమాధికారాన్ని కోల్పోతుందనే ఉద్ధేశ్యంతో వామపక్షాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఏం జరిగినా సరే అణు ఒప్పందంలో తాము ముందుకెళ్లే తీరుతామని పంతం పట్టిన కాంగ్రెస్... విశ్వాస తీర్మానంలో తన సత్తా నిరూపించుకుంది. విభేదాలు ఎన్ని ఉన్నా కాంగ్రెస్‌తో జతకట్టిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ విశ్వాస తీర్మానంలో అండగా నిలిచిన సంగతి విదితమే.
ఇక రాజకీయాంశాలను కాసేపు పక్కన పెడితే... భారత్-అమెరికా అణు ఒప్పందంతో దేశంలో దాదాపు లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిశోధనా విభాగంలో కూడా మరెన్నో అవకాశాలు ఏర్పడగలవని విశ్వసిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ అణు ఒప్పందం అంశంపై మాట్లాడుతూ... ఇంధన రంగంలో లక్షలకొద్దీ ఉద్యోగాలతోపాటు దేశంలోని ప్రతి పేదవాడింటికి విద్యుత్ అందించే సౌలభ్యం కలుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో విద్యార్ధులతో సమావేశం సందర్భంగా రాహుల్ అణు ఒప్పందాన్ని వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఇంధన మరియు వాణిజ్య సహాయ మంత్రి జైరామ్ రమేష్ తమిళనాడులోని కల్పకమ్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో, "దేశీయ రియాక్టర్ల నుంచి 10వేల మెగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి, లైట్ వాటర్ రియాక్టర్ల నుంచి 8వేల మెగావాట్లు, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల నుంచి 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చ"ని తెలిపారు.
వీటిని విస్తృత పరిచే క్రమంలో ఇంజినీర్లు, టెక్నీషియన్లు, శాస్త్రవేత్తల అవసరం ఎంతగానో ఉంటుందని రమేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్‌లో 17 అణు రియాక్టర్లు 4,120 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయనీ... కాని, 2007లో ఇంధన కొరత కారణంగా కేవలం 1,800 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయినట్లు విశ్లేషించారు.
2020 నాటికి భారత్‌లో నిర్మాణంలోవున్న ఆరు న్యూక్లియర్ ప్లాంట్‌ల నుంచి అధిక సామర్థ్యం కోసం ఆరు లైట్ వాటర్ రియాక్టర్ల దిగుమతి చేసుకోనున్నట్లు న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ ఎస్ఏ భరద్వాజ్ వెల్లడించారు. ఈ ప్లాంట్ల విస్తరణ కోసం సుమారు 300 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని తెలిపారు.
ఇక భారత అణు ఇంధన విభాగంలో 70వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఆరు న్యూక్లియర్ ప్లాంటులు పూర్తయితే భారత్‌లో లక్ష ఉద్యోగాలు కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు అణు ఇంధన కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ ఎంఆర్ శ్రీనివాసన్ వెల్లడించారు.
ఈ అణు ఒప్పందం కారణంగా భారత్‌లోనే కాకుండా అమెరికాలోని పరిశ్రమలు కూడా పుంజుకుంటాయని నిపుణుల వర్గం అభిప్రాయపడుతోంది. 2007లో భారత్-అమెరికా వ్యాపార మండలి అధ్యక్షుడు రోన్ సోమర్స్ అణు ఒప్పందానికి తన మద్దతు తెలిపారు. ఈ ఒప్పందం ఫలితంగా సుమారు 27వేలకు పైగా ఉన్నతస్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చని అప్పట్లోనే తెలపడం గమనార్హం.
ఇక అణు ఇంధన రంగంలో ఉద్యోగావకాశాలను పొందగోరే వారు న్యూక్లియర్ ఇంజినీరింగ్ మరియు టెక్నాలజీ కోర్సులను చేయాల్సి ఉంటుంది. ఐఐటీ- కాన్పూర్ ఈ తరహా కోర్సులను అందిస్తోంది. ఐఐటీ-చెన్నైలో త్వరలో... అంటే 2009 విద్యాసంవత్సరంలో ఈ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించడమైంది.
దేశంలో న్యూక్లియర్ విద్య మరియు పరిశోధనల్లో ప్రధాన శిక్షణా సంస్థ అయిన హోమీ బాబా జాతీయ శిక్షణా సంస్థ తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులను మరియు అవసరమైన మార్గదర్శకాలను కల్పించనుంది. న్యూక్లియర్ సాంకేతిక పరిజ్ఞానంలో పైస్థాయి విద్యకు భారత్‌లో రెండు కేంద్రాలున్నాయి. అవి ముంబయి మరియు కల్పకమ్. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న బాబా ఇన్‌స్టిట్యూట్‌కు 10 శాఖలు ఉన్నాయి. వాటిలో నాలుగు ప్రధాన కేంద్రాలు మరియు ఆరు స్వయం ప్రతిపత్తి శిక్షణా సంస్థలు ఉన్నాయి.