ఇంటర్నెట్ డాక్టర్ మందుతో పరలోక ప్రయాణం.. ఎందుకలా..?!!

నేటి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే.. వైద్యుడుని సైతం ఇంటర్నెట్లోనే కలిసేంత..! అయితే ఎప్పటిలాగే.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు దానిని పక్కదారి పట్టించే అసాంఘిక శక్తులు సైతం పెరుగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఈ సంఘటన.

న్యూఢిల్లీకు చెందిన ఓ వ్యక్తి హృద్రోగ సమస్యతో బాధపడుతుండేవాడు. ఒకసారి అతను చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ చికిత్స చేయించుకున్న అనంతరం అతను తిరిగి ఇండియా చేరుకున్నాడు. అయితే అమెరికాలో ఉన్న డాక్టర్‌ను తరచూ ఇంటర్నెట్ ద్వారా సంప్రదిస్తూ తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కావలసిన మందుల పేర్లను తెలుసునేవాడు.

అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ.. ఇక్కడి నుంచే మొదలైంది అసలు సమస్య.. ఈ ఇద్దరి సంభాషణను హ్యాక్ చేసిన ఇంటర్నెట్ హ్యాకర్ డాక్టర్, పేషెంట్‌ల ఈ మెయిల్ ఐడిలతో మృత్యు క్రీడ ఆడాడు. డాక్టర్ ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్ ఆ పేషెంట్‌కు తప్పుడు మందులను తీసుకోమని సలహా ఇచ్చాడు.

అయితే.. ఆ పేషెంట్ మాత్రం అవి డాక్టర్ చెప్పిన మందులే అనుకొని గుడ్డిగా వేసేసుకున్నాడు. ఈ సారి మాత్రం పేషెంట్ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందులే ఆ పేషెంట్ ప్రాణలను బలిగొన్నాయి. ఆ మందులు వేసుకున్న అరగంటకే ఆ పేషెంట్ మృత్యువాత పడ్డాడు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఐదేళ్ల తర్వాత వెలుగు చూసింది. కాబట్టి ఇంటర్నెట్‌లో మీరు డాక్టర్ సంప్రదించదలచుకుంటే.. జరజాగ్రత్తగా ఉండండి.

వెబ్దునియా పై చదవండి