జగన్ దోచాడంటున్న బాబు... బాబు మింగేశాడంటున్న విజయమ్మ

మంగళవారం, 29 నవంబరు 2011 (20:37 IST)
WD
చంద్రబాబు నాయుడు లెక్కకు మిక్కిలి ఆస్తులను బినామీ పేర్లతో కలిగి ఉన్నారంటూ వైఎస్ విజయమ్మ పిటీషన్‌పై హైకోర్టు ఆదేశం నేపధ్యంలో చంద్రబాబు ఆస్తులపై సీబీఐ ప్రాథమిక విచారణను చేపట్టింది. ఐతే తమ నాయకుడికి ఎటువంటి బినామీ ఆస్తులు లేవని తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతున్నారు.

చంద్రబాబు నాయుడు తన జీవితం తెరిచిన పుస్తకం అనీ, తన ఆస్తులను ఇప్పటికే ప్రకటించేశానని అంటున్నారు. ప్రకటించిన ఆస్తులకు మించి ఒక్క పైసా చూపించినా తన ఆస్తులన్నిటినీ రాసేస్తానని ప్రతిజ్ఞ సైతం చేస్తున్నారు.

ఇదిలావుండగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కారుచౌకకు భూములు కొనుగోలు చేశారనీ, హైటెక్ సిటీ వస్తుందని సినీనటుడు మురళీమోహన్ కు ముందే ఉప్పందించి అక్కడ భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత హైటెక్ సిటీని నిర్మించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలుగా ఉన్నాయి.

ఇక జగన్ విషయానికి వస్తే.. తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఆయా కంపెనీలకు తాయిలాలు ప్రకటించి పెద్ద మొత్తంలో దోచేశారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. జగన్ లక్ష కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారని పదేపదే చెపుతున్నారు. ప్రస్తుతం జగన్ ఆస్తులపైనా సీబీఐ విచారణ జరుగుతోంది.
WD


సీబీఐ విచారణలో చంద్రబాబు నాయుడు, జగన్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారో.. సక్రమంగానే ఆర్జించారోనన్న విషయం తేలిపోతుంది. మొత్తమ్మీద నాయకులు పరస్పరం తమతమ ఆస్తులపై ఆరోపణలు చేసుకుంటుండటమే కాక కోర్టులకు ఎక్కుతుండటంతో వారి అసలు రంగును ప్రజలు తెలుసుకునే అవకాశం మాత్రం ఏర్పడుతోంది. చూద్దాం.. కొల్లగొట్టిన నాయకులెవరో..?!!

వెబ్దునియా పై చదవండి