కైరో ఫిలిం ఫెస్టివల్‌లో "ఘటోత్కచుడు"

కైరోలో జరుగుతున్న "అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం"లో యానిమేషన్ చిత్రం "ఘటోత్కచుడు" మంచి ప్రశంసలను పొందింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుని.. షెమారు భాగస్వామ్యంతో సూర్యదేవర వినోద్ నిర్మించిన ఈ చిత్రాన్ని, కైరో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రత్యకంగా ప్రదర్శించారు.

అంతేగాకుండా.. ఘటోత్కచుడు చిత్ర దర్శకుడు సింగీతంకు కైరో ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆయన పాల్గొన్నారు. కైరో నుంచి ఆయన సమాచారాన్ని భారత్‌కు పంపుతూ... అనేక విదేశీ చిత్రాల మధ్య మన ఘటోత్కచుడు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు చెప్పారు.

పిల్లలతో పాటు ఇక్కడి పెద్దవారు కూడా ఘటోత్కచుడు చిత్రాన్ని బాగా మెచ్చుకున్నారనీ... ఈజిప్టు వాళ్లకి భారతీయ యానిమేషన్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్లు సింగీతం వెల్లడించారు. ఘటోత్కచుడు చిత్రంపై ఈజిప్టు ప్రజానీకం చూపిస్తోన్న ఆసక్తిని చూస్తోంటే... ఇండో ఈజిప్షియన్ చిత్రం ఒక దాన్ని తీయాలనిపిస్తోందని ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.

వెబ్దునియా పై చదవండి