చక్కటి వేసవి కాలక్షేపాలు... కథల పుస్తకాలు...!!

పిల్లల్లో మానసిక వికాసం కల్పించేందుకు పాఠశాలలో ఉపాధ్యాయులు పాఠాలను బోధించటంతో పాటుగా... పద్యాలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, క్విజ్‌ల్లాంటి వాటిలో శిక్షణనిస్తుండటం పరిపాటి. అది సరి అయినదే అయినప్పటికీ... వాటికి తోడుగా చిన్నారులకు బోధనేతర విద్య కూడా చాలా అవసరం.

ఎందుకంటే.. చిన్నారులకు ఎప్పుడు చూసినా పాఠాలు బోధిస్తుంటే, వారికి విసుగు కలిగే అవకాశం లేకపోలేదు. కాబట్టే... వారికి రకరకాల కథలు, పురాణాలు, శ్లోకాలను కూడా చెబుతుండాలి. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్నారులకు క్లాస్‌రూం పుస్తకాలను బోధించేందుకే ఉపాధ్యాయులకు సమయం చాలటం లేదు. అలాంటిది ఇక కథలు, కాకరకాయలంటే ఎలా...?!

అందుకనే... పిల్లలకు ఆటపాటలతో పాటు, రకరకాల కథల పుస్తకాలను చదివేందుకు వీలుదొరికేది ఒక్క వేసవి సెలవుల్లోనే...! కాబట్టి బాల సాహిత్యంలో పేరెన్నిగన్న పుస్తకాలను తల్లిదండ్రులు వారి, వారి చిన్నారులకు కానుకగా ఇచ్చినట్లయితే.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినవారవుతారు.

పిల్లల్లో పరివర్తన తెచ్చే కథలు, పెద్దలకు కనువిప్పు కలిగించే కథలు, ఆదర్శభావాలు కలిగిన చిన్నారుల గురించి తెలిపే కథలు, రంగు రంగుల బొమ్మల కథలతో కూడిన పుస్తకాలు, చందమామ కథల పుస్తకాలను పిల్లలకు ఈ వేసవి కానుకగా పెద్దవారు ఇవ్వవచ్చు. దీంతో వారు మాతృభాషపై పట్టు సాధించటమేగాకుండా, జీవితంలోని ఆయా కోణాలను వారిదైన శైలిలో విశ్లేషించే సామర్థ్యాన్ని అలవర్చుకుంటారు.

మానవ మనస్తత్వాలనే కాదు, పంచతంత్ర కథలను పోలిన జంతువుల కథల పుస్తకాలను కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. ఇలాంటి పుస్తకాలను కొని పిల్లల ముందుంచి, కొన్ని కథలు చెప్పి, మిగిలిన కథలను వారే చదువుకునేలా ప్రోత్సహించినట్లయితే... మధ్యాహ్నం పూట ఎండలకు బలాదూర్‌గా తిరగకుండా బుద్ధిగా చదువుకుంటారు. జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు.

వెబ్దునియా పై చదవండి