చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన 13 సంవత్సరాల బాలిక ఇషా నితిన్ చంద్ర చవాన్ "యూఎన్ఈపీ గ్లోబల్ పెయింటింగ్" అవార్డును దక్కించుకుంది. కాగా... ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ముంబైకి చెందిన ఇషా, భారత్ నుంచి పాల్గొన్న ఏకైక చిత్రకారిణి కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.
"వాతావరణ మార్పు- మన సవాళ్లు" అనే అంశంపై మన చిన్నారి ఇషా గీసిన చిత్రాలకు ఈ గ్లోబల్ పెయింటింగ్ అవార్డు వచ్చింది. వంద దేశాల నుంచి మొత్తం 750 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచిన ఇషా ఈ అవార్డును సొంతం చేసుకుంది.
కొరియా పర్యావరణ మంత్రి మానెక్ లీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అచిన్ స్టెనర్ 45 వేల రూపాయల నగదు బహుమతిని, జ్ఞాపికను ఈషాకు అందజేశారు. ఈ సందర్భంగా ఈషా తండ్రి నవీన్ చంద్ర మాట్లాడుతూ... తల్లి అడుగుజాడల్లో రెండున్నరేళ్ల ప్రాయంలోనే బొమ్మలు గీయటం నేర్చుకున్న ఈషా.. ఇప్పటిదాకా 219 బహుమతులను అందుకోగా.. వాటిలో 30 అంతర్జాతీయ, 40 జాతీయ, 150 రాష్ట్రీయ అవార్డులున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.