"ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు"

పిల్లలూ...! ఇంట్లో అమ్మ ఎంత రుచిగా వండి పెట్టినా కూడా మీకు ఆకలిగా లేకపోతే, "అది తియ్యగా లేదు, ఉప్పగా ఉంది, బాగలేదు...." అంటూ ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటుంటారు కదూ..! అదే ఆకలిగా ఉంటే మాత్రం ఏమీ అనకుండా.. చక్కగా, బుద్ధిగా తినేస్తుంటారు కూడా...

అలాగే రాత్రిపూట పడుకునే సమయంలో కూడా, నిద్ర రాకపోయినట్లయితే... "అబ్బా... ఆ ఫ్యాన్ గాలి నాకు రావడం లేదు, పడుకున్న పక్క సరిగా లేదు, మెత్తగా లేదు" అంటూ నానా యాగీ చేసి పేచీలు పెడుతుంటారు కదా...! అదే ఎక్కువసేపు ఆటలాడి బాగా అలసిపోయి ఉంటే మాత్రం, ఎక్కడ పడుకున్నామో, ఎలా పడుకున్నామో కూడా తెలియకుండా ఎంచక్కా మీరు నిద్రపోతుంటారు.

సరిగ్గా ఇలాంటి విషయాలనే పోల్చుతూ పూర్వకాలంలో పెద్దలు "ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదు" అన్న సామెతను వాడుకలోకి తెచ్చారు. బాగా ఆకలి వేస్తుంటే రుచి తెలియదని, అలసిపోయి నిద్రపోయేవారు సుఖం గురించి ఆలోచించరని ఈ సామెత అర్థం. ఇలా ఈ సామెతను ఎన్ని రకాల విషయాలకైనా అన్వయించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి