బాలీవుడ్ సెలెబ్రిటీలే కానీ భారతీయులు కాదు.. ఓటు వేయలేని సినీ ప్రముఖులు
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (16:20 IST)
వారంతా బాలీవుడ్ సెలెబ్రిటీలు. వారికి దేశవ్యాప్తంగా అభిమానుల ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. కానీ, వారంతా నిజమైన భారతీయులు కాదు. విదేశీ పౌరులు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, సోమవారంనాటి పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఇలాంటి వారిలో అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఉన్నారు.
ఆ వివరాలను పరిశీలిస్తే, దేశంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలకు మాత్రం ఓటు లేదు. దీనికి కారణం లేకపోలేదు.
నాలుగో విడత పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన బాలీవుడ్ ప్రముఖుల్లో హీరో అక్షయ్ కుమార్ ఒకడిగా మిగిలిపోయాడు. ఈయన పంజాబ్‌లో పుట్టిపెరిగినా, 'కేసరి' సినిమాలో ప్రధాన పాత్ర పోషించినా... పాస్‌పోర్టు మాత్రం కెనడాకి చెందినది. దీంతో ఆయన ఓటు వేయలేక పోయాడు.
ఇకపోతే, 'గల్లీ బాయ్'తో కుర్రకారు మనసు దోచుకున్న అలియా భట్‌కు బ్రిటీష్ పౌరసత్వం ఉంది. ఫలితంగా ఆమె భారత్‌లో ఓటు వేయలేకపోయింది. మరో సంచలన తార దీపికా పదుకొనేది కూడా ఇదే పరిస్థితి. కోపెన్‌హాగన్‌లో పుట్టిన ఆమెకు డెన్మార్క్ పాస్‌పోర్టు ఉండటంతో ఓటు హక్కుకు దూరమయ్యారు.
కానీ, ఆమె భర్త, బాలీవుడ్ రణ్‌వీర్ సింగ్ మాత్రం ఓటు హక్కును కలిగివున్నాడు. దీంతో ఆయన ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. మరో బాలీవుడ్ ముదురు హీరోయిన్ కత్రినా కైఫ్. ఈమె బ్రిటన్ పౌరురాలు. ఈమెకు యూకె పాస్‌పోర్టు ఉంది. ఫలితంగా ఆమె ఓటు వేయలేదు.
ఇక పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సన్నీ లియోనే కూడా అక్షయ్ కుమార్ మాదిరిగానే కెనడా పాస్‌పోర్టు ఉండడంతో ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. తరచూ తన గ్లామర్‌తో భారతీయుల మనసు కొల్లగొడుతున్న మరో హీరోయిన్, 'రేస్-3' స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇండియన్ కాదు. ఆమె బెహ్రయిన్‌లో జన్మించారు. ఫలితంగా స్వదేశంలో ఓటు లేకుండా పోయింది.