ప్రకృతి సోయగాలు.. ఈశాన్య రాష్ట్రాల అందాలు...!!

మేఘాలయ, మిజోరాం, అస్సాం రాష్ట్రాలలో పర్యటించాలంటే, కాస్తంత కష్టమైన విషయమే అయినప్పటికీ... అక్కడి అందమైన ప్రకృతి సోయగాలు, పచ్చటి పర్వతాల హొయలు చూసినట్లయితే, ఎన్ని కష్టాలెదురైనా వెళ్లి తీరాలనిపిస్తుంది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించటంతో, కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది.

ముందుగా, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు వెళ్లాలంటే... విశాఖపట్నం నుంచి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కోలకతా, అటునుంచి గౌహతి చేరుకోవాలి. ఆ తరువాత గౌహతి నుంచి మేఘాలయ రాజధాని నగరమైన షిల్లాంగ్‌ చేరుకోవాలంటే మూడు గంటలపాటు ప్రయాణించాలి.

గౌహతి నుంచి షిల్లాంగ్‌కు వెళ్లే దారి మధ్యలో పొడవైన చెట్లు మనకు స్వాగతం పలుకుతాయి. అక్కడక్కడా కనిపించే ఫైనాఫిల్ పొదలూ మనకు నోరూరిస్తాయి. షిల్లాంగ్ ఇంకో 17 కిలోమీటర్ల దూరం ఉందనగా... రోడ్డుకు కుడివైపున ఒక అందమైన సరస్సు మనల్ని ఆహ్వానిస్తుంది. దాని పేరు మూమియమ్. ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉండే ఆ సరస్సులో వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు.

షిల్లాంగ్ నగరం అందాలు చూశాక.. అక్కడికి 54 కిలోమీటర్ల దూరంలో ఉండే చిరపుంజిని మాత్రం అందరూ తప్పక చూడాలి. ఎందుకంటే, చిన్నప్పుడు మనందరం సాంఘిక శాస్త్ర పుస్తకాల్లో చదువుకున్నట్టి... ప్రపంచంలోనే అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతమే చిరపుంజి.

చిరపుంజి విశేషాలను చెప్పుకోవాలంటే... చిరపుంజిని స్థానికంగా సోహారా అని పిలుస్తారట. అంటే పండ్లు పండని ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతం నైరుతి రుతుపవనాల ప్రయాణ మార్గంలో ఉంటుంది. ఇక్కడి కొండలు గరాటు ఆకారంలో పొడవుగా ఉంటాయి. ఇవి మేఘాలను ఆకర్షిస్తాయి.. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ కొండలపై నుంచి చూస్తే, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం కనిపిస్తుంది. ఈ కొండలలో తేనెపట్టు ఎక్కువ కాబట్టి, చిరపుంజి వర్షపాతంతోపాటు తేనెకు కూడా చాలా ప్రసిద్ధి.

చిరపుంజికి దగ్గర్లోనే చాలా జలపాతాలున్నాయి. వాటిలో మాస్మాయి, నీహాకరికమ్ చూడదగినవి. చిరపుంజిలో రామకృష్ణమిషన్‌వారు 1931లో నిర్మించిన చాలా పెద్దదైన పాఠశాల కూడా ఉంది. ఇక్కడికి దగ్గర్లోనే ఎకో పార్క్, థంగ్ రంగా పార్క్‌లు కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అరుదైన 300 రకాల మొక్కలను మేఘాలయ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పెంచుతారు. ముఖ్యంగా కీటకాలను తినే మాంసాహార మొక్కలను మాత్రం ఇక్కడ తప్పకుండా చూడాల్సిందే.

మేఘాలయాలో దాదాపు 780 గుహలు ఉన్నాయి. వీటిలో కొన్ని గుహల్లోకి వెళ్లడం మాత్రం అసాధ్యం. చిరపుంజి దగ్గర్లోనే క్రెమ్ మావ్‌ముల్ గుహలుంటాయి. ఇవి చూసేందుకు మన ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, బొర్రా గుహల్లాగే ఉంటాయి. లోపలవైపు విద్యుత్ దీపాల అలంకరణతో నిండి ఉంటాయి.

షిల్లాంగ్‌ పట్టణానికి కాస్తంత దూరంలో ఉన్న చిరపుంజి విశేషాలను ఈ వ్యాసంలో చూశాం కదూ...! తరువాతి వ్యాసంలో షిల్లాంగ్‌కు కాస్త దగ్గర్లో ఉండే జలపాతాలు, చూడదగిన పర్యాటక ప్రదేశాలు... అస్సాంలోని కామాఖ్య ఆలయం తదితర విశేషాలను గూర్చిన వివరాలను తెలుసుకుందాం...!