ఆరుషి డీఎన్ఏ సాక్ష్యాన్ని మార్చారు: సీబీఐ

సంచలనాత్మక ఆరుషి- హేమ్‌రాజ్ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. ఆరుషి డీఎన్ఏ సాక్ష్యాన్ని మార్చారని సీబీఐ వర్గాలు తాజాగా తెలిపాయి. బాధితురాలి యోని భాగం నుంచి సేకరించిన నమూనాలను మరో గుర్తు తెలియని మహిళ నమూనాలతో మార్చారని సీబీఐ అనుమానిస్తోంది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్, డయాగ్నోస్టిక్స్‌లో నమూనాలపై పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల అనంతరం డీఎన్ఏ సాక్ష్యాన్ని మార్చిన విషయం బయటపడిందని, సేకరించిన నమూనాలు ఆరుషికి చెందినవి కాదని తాము భావిస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ముందుగా ఆరోపించినట్లుగా సేకరించిన నమూనాలపై వీర్యకణాలేవీ లేదని పరీక్షల్లో తేలిందన్నారు. దీంతో ఈ నమూనాలను ఆరుషి నుంచి సేకరించలేదనే విషయం స్పష్టమవుతుందని సీబీఐ పేర్కొంది.

ఒఖ్లాకు చెందిన డాక్టర్ సునీల్ డెహియర్ మే 15, 2008న ఆరుషి హత్య జరిగిన అనంతరం ఆమె వద్ద నమూనాలు సేకరించారు. ఆ సమయంలో తాను పురుషుని వీర్యాన్ని పోలిన పదార్థాన్ని గుర్తించినట్లు వైద్యుడు చెప్పారు. అయితే అనంతరం డెహియర్ సీనియర్ వైద్యుడు ఎస్‌సీ సింఘాల్ మాత్రం తాము సేకరించిన నమూనాలతో తయారు చేసిన స్లైడ్స్‌లో వీర్యకణాలు లేవని చెప్పారు.

ఆరుషి- హేమ్‌రాజ్ జంట హత్యల కేసుపై జరుగుతున్న దర్యాప్తుపై సీబీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. తాము సుప్రీంకోర్టుకు ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న కారణంగా దర్యాప్తుకు సంబంధించిన వివరాలేవీ పంచుకోలేమన్నారు. అంతేకాకుండా దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని సీబీఐ ప్రతినిధి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి