వామ్మో.. కడుపులో 116 ఇనుప మేకులు.... ఇనుప గోలీ కూడా...

బుధవారం, 15 మే 2019 (10:40 IST)
ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 116 ఇనుపమేకులను వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. వీటితో పాటు ఒక పొడవైన వైరు, ఇనుప గోలీని కూడా వెలికి తీశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని కోట  జిల్లా బుండీ ప్రాంతానికి చెందిన భోలాశంకర్ అనే 42 యేళ్ళ వ్యక్తి కడుపులోనుంచి వీటిని వెలికి తీశారు. 
 
ఈయనకు ఆదివారం తీవ్రమైన కడుపునొప్పిరావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు కడుపు భాగాన్ని ఎక్స్‌రే తీయించగా, కడుపు నిండా ఇనుప మేకులు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ వెంటనే సిటీ స్కాన్ చేసినప్పుడు కడుపులో ఇనుప మేకులు ఉన్నాయని ధృవీకరించారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. ఇలా మొత్తం 116 ఇనుప మేకులను పొట్టలోనుంచి వెలికి తీసినట్టు వైద్యులు వెల్లడించారు. ఒక్కో ఇనుప మేకు పొడవు 6.5 సెం.మీ ఉంటుందని, ఇనుప మేకులు, వైరు, గోలీలను తొలిగించడానికి గంటన్నర సమయం పట్టిందన్నారు. 
 
శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి నిలకడగా ఉందని, చాలా బాగా మాట్లాడుతున్నాడని ఆస్పత్రి ప్రధాన సర్జన్ డాక్టర్ అనిల్ షైనీ వెల్లడించారు. భారీ మొత్తంలో ఇనుప గోళ్లు తన కడుపులోకి ఎలా వెళ్లాయో తెలియదని భోలా శంకర్ చెబుతున్నాడు. తోటమాలిగా పని చేస్తున్న భోలాశంకర్ పొత్తి కడుపులోకి అవి ఎలా చేరాయో తెలియదని ఆయన కుటుంబ సభ్యులూ అంటున్నారన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు