కరోనా ఓ వైపు భారీ వర్షాలు జనాలను భయపెడుతున్నాయి. అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ బలపడింది. దీని ప్రభావం వల్ల గుజరాత్, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. వల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి నిసర్గ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజాగా అస్సాం రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ అస్సాంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
బరాక్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి అస్సాంలో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. కచార్ జిల్లాలో ఏడు మంది, హైలకండి జిల్లాలో ఏడు మంది, కరీంగంజ్ జిల్లాలో ఆరు మంది మృతి చెందారు.
ఈశాన్య రాష్ట్రం ఇప్పటికే భారీ వరదలతో పోరాడుతోంది. వరదల కారణంగా సుమారు 3.72 లక్షల మంది ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దీని ప్రభావంతో గోల్పారా జిల్లా అత్యధికంగా దెబ్బతింది.