మారథాన్ ‌‌పూర్తి చేసిన గంటకు బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృతి

సోమవారం, 24 జులై 2023 (10:01 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. మారథాన్ పరుగును విజయవంతంగా పూర్తి చేసిన ఓ బీటెక్ విద్యార్థి గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పి.మూర్తి జెండాఊపి ఈ మారథాన్ పోటీని ప్రారంభించారు. ఇందులో కళ్ళకుర్చికి చెందిన బీటెక్ విద్యార్థి దినేశ్ కుమార్ ఈ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు.
 
అనంతరం, ఓ గంట పాటు కులాసాగానే ఉన్న యువకుడు తనకు ఒంట్లో ఏదో తెలియని ఇబ్బందిగా ఉందంటూ వాష్‌రూంకు వెళ్లాడు. ఆ తర్వాత అతడికి బాత్రూమ్‌లో పడి ఫిట్స్ వచ్చినట్టు గిలగిలా కొట్టుకోవడంతో స్నేహితులు గుర్తించి అతడిని సమీపంలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు బాధితుడికి కృత్రిమ శ్వాస, జీవనాధార వ్యవస్థపై ఉంచి చికిత్స ప్రారంభించారు. ఉదయం 10 గంటల సమయంలో దినేశ్‌కు గుండెపోటు రావడంతో మరణించాడు. యువకుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దినేశ్ మదరైలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు