ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం :: వంతెనపై నుంచి పడిన బస్సు - ఐదుగురు దుర్మరణం

వరుణ్

మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (08:43 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వంతెనపై నుంచి ఓ బస్సు ప్రమాదవశాత్తు కిందపడింది. ఈ ఘటనపై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు వంతెనపై నుంచి పడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, మొత్తం 47మంది ప్రయాణికులతో పూరీ నుంచి బంగాల్​కు సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో జాజ్‌పుర్​​లోని 16వ జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఫ్లైఓవర్​ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన వారి వెంటనే కటక్​లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.
 
ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రవాణా కమిషనర్ అమితవ్ ఠాకూర్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 16 అంబులెన్స్​ల సాయంతో కటక్​ ఆస్పత్రికి తరలించాం. గ్యాస్​ కట్టర్లను ఉపయోగించి బస్సు కిటికీలు కత్తిరించి ప్రయాణికులను రక్షించాం. అనంతరం బస్సును క్రేన్​ సహాయంతో పైకి తీశాం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బంగాల్​కు చెందినవారే ఉన్నారు' అని అమితవ్ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు