హర్యానాలోని కర్నాల్‌లో పాఠశాలలో 54 మందికి కరోనా పాజిటివ్

మంగళవారం, 2 మార్చి 2021 (18:06 IST)
హర్యానాలోని కర్నాల్‌లో గల ఓ పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. గడిచిన డిసెంబర్‌ నెలలో 9 నుంచి 12వ తరగతి వరకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అదేవిధంగా ఫిబ్రవరి 24 నుంచి 3 నుంచి 5 తరగతులకు అనుమతి తెలిపింది. 
 
సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కాంటాక్ట్‌-ట్రేసింగ్‌-టెస్టింగ్‌ పద్ధతిలో స్కూల్‌ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 54 మంది విద్యార్థులకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. స్కూల్‌ హాస్టల్‌ భవనాన్ని సీజ్‌ చేసి కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
ఫిబ్రవరి 22న ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ స్కూల్‌ను మూడు భాగాలుగా విభజించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఓ వింగ్‌లోని విద్యార్థి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే ఆ విభాగాన్ని 10 రోజులపాటు మూసివేస్తారు. 
 
ఆపై మొత్తం స్కూల్‌ను శానిటైజ్‌ చేస్తారు. ఒకవేళ ఒక వింగ్‌ కంటే ఎక్కువగా విద్యార్థులు కొవిడ్‌ భారిన పడ్డట్లు తెలితే మొత్తం స్కూల్‌నే 10 రోజుల పాటు బంద్‌ చేయనున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగనున్నట్లు, పాఠశాలకు వెళ్లడం వారి ఐశ్చికమేనని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు