8 కేంద్ర ప్రభుత్వ శాఖల అమ్మకానికి సన్నాహం

ఆదివారం, 21 మార్చి 2021 (09:44 IST)
కేంద్ర ప్రభుత్వంలో 8 మంత్రిత్వ శాఖలకు చెందిన ఆస్తులను, సంస్థలను పూర్తిగా అమ్మేయడానికి రంగం సిద్ధమైంది రైల్వే స్టేషన్ల నుండి టెలికాం టవర్లు వరకు, ఎయిర్‌ పోర్టుల నుంచి రోడ్ల వరకు వివిధ ఆస్తులను 'అమ్మకం లేదా ప్రయివేటీకరణ'కు సిద్ధం చేస్తూ ఒక జాబితా రూపొందించాలని బిజెపి ప్రభుత్వం  నిర్ణయించింది.

2021-24 మధ్య ఈ ప్రక్రియ ద్వారా నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్‌ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. ఈ ఆస్తుల అమ్మకాల ద్వారా సుమారు రూ.2.5 లక్షల కోట్లు సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
150 ప్యాసింజర్‌ రైళ్లను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం ఈ ప్రణాళికలో భాగం. ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాలను నిర్వహించే జాయింట్‌ వెంచర్లలో విమానాశ్రయాల అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) ఈక్విటీ వాటాను ఉపసంహరించు కోవాలని నిర్ణయించింది. దేశ రాజధానిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వంటి స్టేడియాలను లీజు ప్రాతిపదికన ప్రయివేటుకు కట్టబెట్టనున్నారు. 
 
2021-22లో ఆస్తుల మోనటైజేషన్‌ ద్వారా రూ.90 వేల కోట్లను సేకరించాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదిలో 150 ప్యాసింజర్‌ రైళ్లను ప్రైవేట్‌ కంపెనీలకు ఇవ్వనున్నారు. పిజిసిఐఎల్‌ ప్రసార ఆస్తులను మోనటైజ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దీనివల్ల 2021-22లో విలువైన ఆస్తుల ద్వారా రూ.7 వేల కోట్లకు పైగా డబ్బు ఆర్జించాలని యోచిస్తోంది. అంతేకాకుండా ఎంటిఎన్‌ఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, భారత్‌నెట్‌ ఆస్తులను ద్వారా డబ్బు ఆర్జించాలని ప్రభుత్వం యోచి స్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌, భారత్‌ నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ టవర్లు ప్రైవేటీకరించాలని భావిస్తోంది.
 
2021-22లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆస్తుల అమ్మకాలకు సంబంధించి ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల జాయింట్‌ వెంచర్‌లో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) వాటాను విక్రయించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అలాగే షిప్పింగ్‌ పోర్టులు, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతి ద్వారా డబ్బు ఆర్జించాలని యోచిస్తున్న 30 బెర్త్‌లను గుర్తించింది. ఇవి కాకుండా ఎనిమిది మంత్రిత్వ శాఖలు, అనేక ఇతర ప్రభుత్వ రంగ ఆస్తులను మోనటైజేషన్‌ (వాటాలు అమ్మకం, ప్రైవేటీ కరణ, లీజులకు ఇవ్వడం) చేయడానికి నిర్ణయించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు