ఉరుములు, మెరుపులు వస్తున్నాయంటే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని చెపుతారు. హఠాత్తుగా పిడుగులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు దరిదాపుల్లో పక్కా భవనం ఏదీ లేనప్పుడు కనీసం పల్లంగా వున్న ప్రదేశాన్ని చూసుకుని బోర్లా పడుకుండిపోవాలని పెద్దలు చెపుతారు. ఎందుకంటే ఒక చిన్న పిడుగుకి రోజుకి 500 ఇళ్లకు విద్యుచ్ఛక్తి సరఫరా చేసేంత శక్తి వుంటుందట. మరి అంతటి శక్తివంతమైన పిడుగు మనిషిని తాకితే ఇంకేముంటుంది? ఐతే ఇలాంటి పిడుగులను బంధించాలని కొంతమంది చూస్తుంటారు.
అలాంటి ఘటనే తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో జరిగింది. పిడుగు పడటాన్ని తన మొబైల్ ఫోన్లో ఫొటో తీసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడతను. సున్నంబుకుళం గ్రామంలో తన స్నేహితుని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా పిడుగులతో కూడిన వర్షం పడుతోంది. దానితో అతడు మెరుపు తీగల్లా భూమిని తాకుతున్న పిడుగును తన మొబైల్ ఫోనులో బంధించాలని ప్రయత్నించాడు.