కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన తెలుగు డాక్టర్ శ్రీకాంత్

గురువారం, 20 జులై 2017 (04:31 IST)
దేశ రాజధానిలో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలో వైద్యుడిగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది.  క్యాబ్‌ డ్రైవర్‌ చేతిలో ఢిల్లీలో అపహరణకు గురైన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌గౌడ్‌ క్షేమంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. యూపీలో శ్రీకాంత్‌ ఆచూకీ లభించిందని, గురువారం ఉదయంలోగా ఢిల్లీకి తీసుకొస్తామని తెలిపారు. 
 
ఈ కిడ్నాప్ వివరాలను ఏసీపీ రాహుల్‌ మీడియాకు వెల్లడించారు. నేర చరిత గల ఓ ముఠా పక్కా ప్రణాళిక ప్రకారమే శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిందని వెల్లడించారు. ప్రత్యేక బృందాలు ముఠాను వెంటాడినట్లు తెలిపారు. శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ ఉత్తరప్రదేశ్‌ నోయిడా సమీపంలోని దాద్రిలో ముఠాలోని మిగిలిన సభ్యులను కలిశాడని వివరించారు. అనంతరం అపహరించినట్లు శ్రీకాంత్‌ మొబైల్‌లో ఫొటోలు తీసి ఓలా యాజమాన్యానికి పంపారని తెలిపారు.
 
శ్రీకాంత్‌ ఆచూకీ కోసం వెతుకుతుండగా ఆది వారం యూపీ పోలీసులు, ఢిల్లీ పోలీసులకు కిడ్నాప్‌ ముఠా  మీరట్‌లో తారసపడగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని, అయితే వారు తప్పించుకున్నారని చెప్పారు. బుధవారం ముజఫర్‌నగర్‌ సమీపంలో ఎదురుపడగా, మరోసారి కాల్పులు జరిగాయన్నారు. చివరికి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. శ్రీకాంత్‌ క్షేమంగా ఉన్నాడని, గురువారం ఉదయం ఢిల్లీకి తీసుకొస్తామని వివరించారు. 
 
కాగా, శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడానని ఢిల్లీలో ఉన్న శ్రీకాంత్‌ బాబాయి నారాయణగౌడ్‌ చెప్పాడు. శ్రీకాంత్‌ క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్న శ్రీకాంత్‌తో మాట్లాడినట్లు తండ్రి జనార్దన్‌గౌడ్‌ తెలిపాడు. శ్రీకాంత్‌ క్షేమంగా ఉండటంతో గద్వాల మొమిన్‌మెహల్లాలోని అతడి ఇంటి వద్ద ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులు, కాలనీవాసులు మిఠాయిలు పంచుకున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి