అనాసపండు కాదు.. పటాసుల కొబ్బరికాయను తినడం వల్లే ఏనుగు..?

శనివారం, 6 జూన్ 2020 (13:26 IST)
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు అనాసపండులో పటాసులు నింపి ఇచ్చారని... అందుకే అది మరణించిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్ని రోజులు పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ తినడం వల్ల ఏనుగు చావుకు కారణమయ్యిందని అందరూ అనుకుంటుండగా.. తాజాగా టపాకాయలు నింపిన కొబ్బరికాయను తిని ఏనుగు మరణించిందని అటవీశాఖ అధికారి సునీల్‌ కుమార్‌ వెల్లడించారు.
 
ఇప్పటికే ఏనుగు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసుతో సంబంధం ఉన్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడి అయ్యింది. నిందితుడి పేరు విల్సన్‌గా, ఇతడు చెట్ల నుంచి రబ్బరు తీసేవాడుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇతడు ఇద్దరు బాంబుల తయారు చేస్తున్న వారికి సహాయం చేస్తున్నాడని తేలింది. 
 
ఈ కేసులో మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఉచ్చులుగా ఉంచుతారు. ఈ క్రమంలో ఏనుగు పేలుడు పదార్థంతో నింపిన కొబ్బరికాయను తినడం వల్ల అది ఏనుగు నోటిని పూర్తిగా గాయపరిచింది. ఇలా విపరీతమైన నొప్పితో ప్రాణాలు కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు