అన్నాడీఎంకే వైరి వర్గాలు ఏకమయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు చాలా రోజుల తర్వాత ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత రెండు వర్గాలు విలీనమైనట్టు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, సోమవారం ఉదయం నుంచి అన్నాడీఎంకే గ్రూపుల విలీనంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న విషయం తెల్సిందే. కొంతసేపు విలీన ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత ఎట్టకేలకు దిగివచ్చిన పన్నీర్ సెల్వం.. ఆర్నెల్ల తర్వాత పన్నీర్ సెల్వం చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయానికి వచ్చారు. అనంతరం సీఎం పళనిస్వామితో సమావేశమై కొద్దిసేపు చర్చలు జరిపిన విలీనంపై ప్రకటన చేశారు.
అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తేనే ఇరు వర్గాల విలీనం సాధ్యమని పన్నీర్ సెల్వం చేసిన ప్రతిపాదన పట్ల పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికిపుడు బహిష్కరిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనీ, అందువల్ల విలీన ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి అందులో తీర్మానం శశికళను బహిష్కరిద్దామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఓపీఎస్ వర్గం బెట్టువీడి విలీన ప్రక్రియకు సమ్మతించింది.