శశికళకు, పన్నీర్‌కు నల్లకుబేరుడు శేఖర్ రెడ్డి సన్నిహితుడా? ఆస్పత్రిలో అమ్మకు లడ్డూ తెచ్చిచ్చాడా?

శనివారం, 10 డిశెంబరు 2016 (13:10 IST)
నల్లకుబేరుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు జె.శేఖర్ రెడ్డి పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. ఐటీ సోదాల్లో కోట్లాది రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, భారీ బంగారం బయటపడటంతో అయ్యగారి పేరు అందరికీ తెలిసిపోయింది. శేఖర్ రెడ్డి నివాసంలో మొత్తం రూ.90 కోట్ల నోట్ల కట్టలు బయటపడగా, అందులో రూ.70 కోట్లు కొత్త కరెన్సీ నోట్లు కావడం గమనార్హం. అయితే, తితిదే పాలక మండలి సభ్యుడిగా ఉన్న జె.శేఖర్ రెడ్డి ఎవరో కాదు.. వేలూరు జిల్లా కాట్పాడికి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామవాసి. ఇంకా చెప్పాలంటే.. ఈయన జయలలిత నెచ్చెలి శశికళకు సన్నిహితుడు. 
 
అంతేకాదండోయ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం, జయలలిత స్నేహితురాలు శశికళ, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావులకు అత్యంత సన్నిహితుడు. వీరి ద్వారానే తమిళనాడు ప్రభుత్వానికి చెందిన సుమారు రూ. వెయ్యి కోట్ల కాంట్రాక్టులను దక్కించుకుని పనులు చేస్తున్నారు. వీరి సిఫార్సుతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తితిదే పాలక మండలి సభ్యుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, శేఖర్ రెడ్డి ఇంట్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన విషయం మరువకముందే చెన్నైలో మళ్లీ పెద్ద ఎత్తున సొమ్ము బయటపడింది. ఐటీ అధికారులకు ఇంత పెద్ద మొత్తం సొమ్ము పట్టుబడటం ఇదే తొలిసారి. ఇంకా పట్టుబడిన కొత్త కరెన్సీకి సంబంధించి కనీసం బ్యాంకు రసీదులు కూడా లేకపోవడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరెన్సీ మార్పిడి కోసం కొందరు సిండికేట్‌గా ఏర్పడినట్టు సమాచారం రావడంతో అధికారులు మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు.
 
అన్నీ కొత్త నోట్లతో 170 కోట్ల నగదు, ఇంకా 130 కిలోల బంగారంతో పట్టుబడిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలు మెయిన్‌టైన్ చేసేవాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు.. ఆయన స్వయంగా ఆస్పత్రికి వెళ్లి, తిరుపతి లడ్డూ కూడా తీసుకెళ్లారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంతో కూడా శేఖర్ రెడ్డికి మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. 
 
గత సంవత్సరం పన్నీర్ సెల్వం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లినప్పుడు కూడా ఆయన వెంటే ఉండి.. స్వయంగా ఆలయంలోకి తీసుకెళ్లింది కూడా ఈ శేఖర్ రెడ్డే. వీళ్లిద్దరికీ ఉన్న సంబంధం ఏంటని అన్నాడీఎంకే వర్గాలను ప్రశ్నించగా.. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో వచ్చారే తప్ప పన్నీర్ సెల్వంకు ఆయనతో సంబంధం ఏమీ లేదని చెప్తున్నారు. మరి నిజమేంటో.. ఆ వెంకన్నకే ఎరుక. 

వెబ్దునియా పై చదవండి