ఎయిరిండియా విమానంలో ఏసీ యంత్రాలు పని చేయలేదు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఫలితంగా ఈ విమానం ఏకంగా 24 గంటల మేరకు ఆలస్యంగా నడిచింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 183 విమానం గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ, సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
అనుకోని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు విమానం బయల్దేరనుందని తొలుత ఎయిరిండియా వర్గాలు వెల్లడించగా.. కాసేపటికి విమానం రద్దయినట్లు ప్రకటించారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలా 24 గంటల ఆలస్యం తర్వాత ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయల్దేరనున్నారు.