వాతావరణ కాలుష్యంతో మధుమేహం.. కలుషిత గాలి ఇన్సులిన్ ఉత్పత్తిపై?

ఆదివారం, 1 జులై 2018 (15:32 IST)
వాతావరణ కాలుష్యంతో డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా వుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరిగేందుకు గాలి కలుషితం కారణమని లాన్సెట్ రిపోర్టులో వెల్లడి అయ్యింది.


ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(ఈపీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లు అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ విజృంభించిందని పరిశోధకులు రిపోర్టులో తెలిపారు. 
 
2016లో గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల డయాబెటిస్‌ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. గాలి కాలుష్యం వల్ల 42 లక్షల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి గోల్స్‌ రిపోర్టు-2018లో తెలిపింది.  
 
మధుమేహం రావడానికి కారణాల్లో గాలి కాలుష్యం ఒకటని పరిశోధకులు తెలిపారు. వాతావరణ కాలుష్యంతోనే మధుమేహం ఆవహిస్తుందని తేలడంతో భారత్ పెనుప్రమాదంలో వుందని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఇక కాలుష్య కోరల్లో చిక్కుకున్న న్యూఢిల్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
కలుషిత గాలి ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపి, రక్తంలోని గ్లూకోజ్‌‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుంది. తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేకపోవడం వల్ల అక్కడ పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు రిపోర్టులో ఉంది. అందుచేత వాతావరణ కాలుష్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు