భారమైన హృదయంతో భారత్‌లో సేవలు నిలిపివేస్తున్నాం : అమ్నెస్టీ ఇంటర్నేషనల్

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (15:28 IST)
అంతర్జాతీయ మానవహక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను కేంద్రం అధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది. దీంతో ఈ తరహా కఠిన నిర్ణయాన్ని భారమైన హృదయంతో తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థకు చెందిన భారత్ విభంగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఈ నెల 10వ తేదీ ఈ సంస్థకు చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను ఈడీ పూర్తిగా సీజ్ చేసింది. దీనిపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందిస్తూ, భారత్‌లో తమ సంస్థ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఆరోపణలు గుప్పించింది. 
 
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై తామిచ్చిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలిపింది. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం సర్కారుకి ఇష్టం లేదని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పుకొచ్చారు.
 
ముఖ్యంగా, ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కాశ్మీర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేస్తోందని ఆరోపించారు. భారత్‌లో ఇక తాము సేవలు అందించలేమని తెలిపారు. మొత్తం 70కి పైగా దేశాలలో పనిచేస్తున్న తాము.. 2016లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను నిలిపేశామని అన్నారు. ఇప్పుడు భారత్‌లో మూసేస్తున్నామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు